ఏపీ సర్కార్ పై ఈసీకి ఫిర్యాదు
ఢిల్లీలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం
న్యూఢిల్లీ – ఏపీలో ఎన్నికల వేళ ప్రస్తుతం కొలువు తీరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు అన్ని వైపుల నుంచి షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే వాలంటీర్లను ఎన్నికల్లో విధులకు తీసుకోవద్దని టీడీపీ కూటమి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం నిప్పులు చెరిగింది. ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలను జగన్ మోహన్ రెడ్డి సర్కార్ గాలికి వదిలి వేసిందని ఆరోపించింది.
ఏపీలో సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం నిస్సిగ్గుగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం దారుణమని, వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కోరింది. ప్రస్తుత పథకాలు లబ్దిదారులకు అందేలా చూడాలని తాము ఈసీని కోరామని బృందం తెలిపింది.
వివిధ ప్రభుత్వ పధకాలు, సమాచార సాధనాలు, సర్కారు కమ్యూనికేషన్ మెటీరియల్, వీటన్నిటిలో ఇంకా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కొనసాగడంపై అభ్యంతరం తెలిపింది. ఏపీలో ఆపద్దర్మ ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది.