అభ్యర్థులపై కాంగ్రెస్ ఫోకస్
10 స్థానాలకు పరిశీలన
హైదరాబాద్ – తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే టీపీసీసీ ఆధ్వర్యంలో ఆశావహులకు సంబంధించిన జాబితాను ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి పంపింది.
పార్టీ పరంగా విశ్వసనీయ సమాచారం మేరకు మొత్తం స్థానాలలో 10 స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టేనని టాక్. ఇప్పటికే కోడంగల్ లో జరిగిన బహిరంగ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక సీటు కు సంబంధించి అభ్యర్థిని ప్రకటించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చందర్ రెడ్డిని పాలమూరు లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థిగా వెల్లడించారు. దీంతో పార్టీలో మొత్తం 16 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
మహబూబ్ నగర్ నుంచి చల్లాకు కేటాయించగా చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి లేదా ఎరవర్తి అనిల్ , కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంత రావు, మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్ ను ఖరారు చేసినట్లు టాక్.
ఇక జహీరాబాద్ లోక్ సభ స్థానం నుంచి సురేష్ షెట్కర్ ను ఖరారు చేసింది. ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కేటాయించ లేదు. ఎక్కువగా పోటీ పడిన నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి డాక్టర్ మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీని ఖరారు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్ , నల్లగొండ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.