NEWSTELANGANA

రైత‌న్న‌ల‌కు స‌ర్కార్ భ‌రోసా

Share it with your family & friends

రైతు నేస్తం అన్న‌దాత‌ల‌కు ఆస‌రా

హైద‌రాబాద్ – రైతుల‌కు మేలు చేకూర్చేలా రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా రైతుల‌కు అందుబాటులో ఉండేందుకు గాను రైతు నేస్తం కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. రైతాంగం ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా రైతు నేస్తం కార్య‌క్ర‌మం ఉప‌యోగ ప‌డుతుంద‌ని ఈ సంద‌ర్బంగా అన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.

కరువొచ్చినా, కష్టమొచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలను అనుసంధానం చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు సీఎం.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్‌ విధానంతో అనుసంధానం చేస్తార‌ని తెలిపారు. ప్రయోగాత్మకంగా తొలి విడత 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను నెలకొల్పడం జ‌రిగింద‌న్నారు సీఎం.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రూ. 97 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర అధికారులతో పాటు వ్యవసాయ నిపుణులు నేరుగా గ్రామాల్లో, పంట పొలాల్లో ఉండే రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకోవడానికి ఈ సదుపాయం వీలుకల్పిస్తుంది.