కేసీఆర్ పాలనలోనే అప్పుల కుప్ప
కాగ్ నిగ్గు తేల్చిందన్న కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్ – తాజాగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కాగ్ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. అభివృద్ది పేరుతో గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాకాన్ని తేటతెల్లం చేసింది. అంకెలతో సహా ఎలా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చాడో వివరించింది. ఇందుకు సంబంధించిన నివేదిక ఎలా దోపిడీకి పాల్పడ్డారో బట్ట బయలు చేసింది. ప్రస్తుత సర్కార్ పై అప్పుల భారం మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
నిప్పు లాంటి నిజాలను బయట పెట్టింది కాగ్. నిన్నటికి నిన్న అసెంబ్లీలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలను, ఇవాళ కాగ్ నివేదికలో తేలిన విషయాలను బేరీజు వేసుకుని తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది కాంగ్రెస్ సర్కార్. ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించింది.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, గడచిన ఎనిమిది నెలల్లో 40 వేల కోట్లు అప్పులు, మిత్తి చెల్లించామని అసెంబ్లీ వేదికగా వాస్తవాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారని తెలిపింది. దీనిపై నానా యాగీ చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు పై మండిపడింది.
వచ్చే పదేళ్లలో 3 లక్షల కోట్ల అప్పులు కట్టాల్సి ఉందని కాగ్ తేల్చిందని, దీనికి బీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెబుతారంటూ నిలదీసింది.