NEWSTELANGANA

కాళేశ్వ‌రం నిధుల‌న్నీ దొర ఫాం హౌస్ కు

Share it with your family & friends

మాజీ సీఎంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్

హైద‌రాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. మాజీ సీఎం కేసీఆర్ కార‌ణంగానే కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌క్క‌దారి ప‌ట్టింద‌ని ఆరోపించారు. ఆదివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించింది. కేసీఆర్ ముందు చూపు కార‌ణంగానే ఇవాళ కాళేశ్వ‌రం క‌ళ క‌ళ లాడుతోంద‌ని పేర్కొంటూ మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది.

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. నాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిధులన్నీ దొర గారి ఫాం హౌస్ కు తరలిపోయాయ‌ని, ఇవాళ ఆయ‌న చేసిన నిర్వాకం కార‌ణంగా గోదావరి నీళ్లన్ని సముద్రానికి తరలి పోతున్నాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది కాంగ్రెస్ పార్టీ.

కేసీఆర్, ఆయ‌న ప‌రివారం కాసులకు కక్కుర్తి పడి, అంచనాలను పెంచి, అడ్డదిడ్డంగా కట్టిన ప్రాజెక్టు నేడు దేనికి పనికి రాకుండా పోతుందని పేర్కొంది. నీళ్లాగితే ప్రాజెక్టు కుప్ప కూలుతుంది కాబట్టే, వచ్చిన నీళ్లన్నీ వచ్చినట్టే కిందికి పోతుంటే.. అది కూడా సిగ్గు లేకుండా గొప్పగా చాటి చెప్పుతున్నారంటూ మండిప‌డింది.

ప్రజా ధనం వృధా చేసిన మీకు కొంచెం కూడా పశ్చాత్తాపం లేక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొంది కాంగ్రెస్ పార్టీ. 80 వేల పుస్తకాలు చదివిన మహా మేధావి, తమకు తామే కాళేశ్వరరావుగా నామకరణం చేసుకొని, రివర్స్ ఇంజనీరింగ్ పేరుతో ప్రాజెక్టు మొత్తం ఉల్టా పల్టా చేశాడంటూ ఎద్దేవా చేసింది.