ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల హామీ
విజయవాడ – సదరన్ రీజియన్ బల్క్ ఎల్పీజీ ట్రాన్స్‌పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన బల్క్ ఎల్పీజీ రవాణాదారుల సమ్మె నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) తమ ఎల్పీజీ వినియోగదారులకు తగినంత సిలిండర్ సరఫరా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చాయి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బాట్లింగ్ ప్లాంట్లలో బల్క్ ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయన్నారు. ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రవాణా టెండర్‌ను అన్ని ప్రాంతాల ట్రాన్స్‌పోర్టర్లతో విస్తృత చర్చల తర్వాత తుది రూపం ఇచ్చారన్నారు.
ఈ ప్రక్రియలో రవాణాదారుల వివిధ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమైన సందేహాలను నివృత్తి చేసేందుకు వివరణలు ఇచ్చారన్నారు. చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, గువాహటి నగరాల్లో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశాల ద్వారా వారి అభిప్రాయాలను కూడా కలుపుకున్నారన్నారు. ఈ టెండర్ నిబంధనలను ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు, కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను పాటిస్తూ పూర్తిగా పారదర్శకంగా రూపొందించారని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పీఈఎస్ఓ, పీఎన్జీఆర్బీ, ఓఐఎస్డీ వంటి చట్టబద్ధ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయన్నారు. ఎల్పీజీ రవాణా భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మా ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త టెండర్ నిబంధనలను తీసుకు వచ్చామన్నారు.