NEWSTELANGANA

పంజాగుట్ట ఖాకీల‌కు సీపీ షాక్

Share it with your family & friends

పంజాగుట్ట‌లో పోలీసులంతా బ‌దిలీ

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ కొత్త‌కోట శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. న‌గ‌రంలో ప్రాముఖ్య‌త క‌లిగిన పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ లో ప‌ని చేస్తున్న వారంద‌రినీ బ‌ద‌లీ చేశారు. ఆ వెంట‌నే రిలీవ్ కావాల‌ని ఆదేశించారు. దీంతో ఆయ‌న తీసుకున్న ఈ కీల‌క నిర్ణ‌యం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో పోలీసు శాఖ న‌వ్వుల పాలైంది. అంతే కాదు అంతులేని అవినీతికి కేరాఫ్ గా పేరు తెచ్చుకుంది. చాలా మంది ఉన్న‌త స్థానాల‌లో ఉన్న పోలీస్ ఉన్న‌తాధికారులు సైతం గులాబీ నేత‌ల‌కు గులాం గిరీ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

తాజాగా సీపీగా కొలువు తీరిన వెంట‌నే కొత్త‌కోట శ్రీ‌నివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌ప్పు ఎవ‌రు చేసినా స‌రే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌ధానంగా న‌గ‌రాన్ని డ్ర‌గ్స్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దుతాన‌ని శ‌ప‌థం చేశారు.

ఇక తీవ్రమైన అవినీతి, ఆరోప‌ణ‌లు రావ‌డంతో పంజాగుట్ట పీఎస్ లో ప‌ని చేస్తున్న వారంద‌రినీ ప్ర‌క్షాళ‌న చేశారు. ప్ర‌స్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.