స్పష్టం చేసిన సీపీ రాజ శేఖర్ బాబు
విజయవాడ – ఈ ఏడాది పోలీస్ శాఖ ఎన్నో సవాళ్లను అధిగమించిందని అన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజ శేఖర్ బాబు. పోలీస్ శాఖ అద్భుతమైన పనితీరు కనబర్చిందని అన్నారు. అనేక సంస్కరణలను తీసుకు వచ్చామని చెప్పారు. ఇంకా చాలా గమ్యాలను చేరుకోవాల్సి ఉందన్నారు. అస్త్రం యాప్ తో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించామన్నారు. భవానీ దీక్షలకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు.
సోమవారం సీపీ రాజ శేఖర్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా సేవలు అందించిందని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారాలను చూపిస్తూ విజయం సాధించామన్నారు.
దాతలు ముందుకు వచ్చి 27 డ్రోన్స్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు సీపీ. ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక డ్రోన్ అందజేశామని వెల్లడించారు. డ్రోన్స్ ద్వా రా అధునాతన టెక్నాలజీ తో అనేక నేరాలను అరికట్టడం జరిగిందన్నారు.
2025 లో అనేక విధానాలతో ముందుకు వెళతామన్నారు. అస్త్రం యాప్ ను ఉపయోగించుకుని రాబోయే ఫ్లై ఓవర్ బ్రిడ్జి లపై అలాగే మరెన్నో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టనున్నామని ప్రకటించారు. సైబర్ సిటిజన్ యాప్ ద్వారా అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్లడం జరిగిందన్నారు.
దాదాపు 3 లక్షల మంది విద్యార్థులను సబ్స్క్రయిబర్ లుగా చేశామని తెలిపారు. ఈ యాప్ ద్వారా నేరగాళ్ల ఆట కట్టించడం జరిగిందన్నారు. వరదల సమయంలో పోలీస్ శాఖ అద్భుతంగా పనిచేసి 14 రోజుల పాటు విశిష్ట సేవలు అందించడం అభినందనీయమన్నారు.