పిలుపునిచ్చిన సీపీఐ ఎంఎల్ డెమోక్రసీ నేత
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో మిలియన్ మార్చ్ కార్యక్రమానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నదని అన్నారు సీపీఐ ఎంఎల్ డెమోక్రసీ సీనియర్ నేత కె. గోవర్దన్ . ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కు గా భావించిన మలిదశ ఉద్యమం విజయ తీరాలకు చేరడంలో మిలియన్ మార్చ్ ది ప్రధాన పోరాట ఘట్టమని పేర్కొన్నారు. అది సీమాంద్ర దోపిడీ దారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించడం తో పాటు, ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచిందన్నారు. ఆ స్పూర్తిని కొనసాగించాలని కోరారు.
ఎక్కడ దోపిడీ, పీడన, వివక్షత, అణచివేత, అన్యాయం, క్రూర నియంతృత్వం ఉంటుందో, అక్కడ తప్పనిసరి ప్రజా తిరుగుబాటు ఉంటుందని నిరూపించిన మిలియన్ మార్చ్ పాలకులకు నిరంతరం హెచ్చరిక లాంటిదన్నారు సీపీఐఎంఎల్ డెమోక్రసీ నాయకుడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాలుగు కోట్ల ప్రజానీకానికి అను నిత్యం స్ఫూర్తి ని నింపే, అమరుల త్యాగాల్ని గొప్పగా గానం చేసిన మిలియన్ మార్చ్ పోరాడే ప్రజానీకానికి సదా స్మరణీయమన్నారు.