ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చిన ఎంపీ రమేష్ కు షాక్
తిరిగి పంపించిన ఎంపీ సుదామ ప్రసాద్
ఢిల్లీ – ఎవరైనా తమకు ఖరీదైన బహుమతులు వస్తే తీసుకునేందుకు రెడీగా ఉంటారు. కానీ బీహార్ కు చెందిన సుదామ ప్రసాద్ మాత్రం తనకు వద్దంటూ తిరిగి పంపించారు. ప్రస్తుతం ఆయన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఇంతకూ ఆ ఖరీదైన గిఫ్టులు అందజేసింది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ రమేష్.
ఇక ఎవరీ సుదామ అనుకుంటున్నారా ..ఆయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) లిబరేషన్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు. రైల్వే శాఖ పని తీరుపై అధ్యయన కమిటీలో సుదామ ప్రసాద్ కూడా ఉన్నారు. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (ఆర్ఐటీఈఎస్), రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) తనకు బహుమతులను పంపించింది. వాటిని ఎంపీ సుదామ ప్రసాద్ తనకు వద్దంటూ తిరిగి పంపించారు.
ఈ ఏడాది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు రైల్వేపై స్టాండింగ్ కమిటీ అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా తనకు పంపించిన గిఫ్టులు వద్దంటూ సీరియస్ గా ఎంపీ సీఎం రమేష్ కు లేఖ రాశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక గ్రాము బంగారు నాణెంతో పాటు 100 గ్రాముల వెండి బ్లాక్ ను పంపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ.
ఎవరైనా పువ్వులు, శాలువాలు, పెయింటింగ్ లు , కొన్ని జ్ఞాపకాలను సాధారణంగా బహుమతులుగా ఇస్తారు. కానీ ఆర్ఐటీఈఎస్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ తనకు ఇచ్చిన బహుమతులు మరింత బాధ కలిగించాయని పేర్కొన్నారు ఎంపీ సుదామ ప్రసాద్. ఈ చర్య అనైతికమని, పూర్తిగా ప్రజస్వామ్య స్పూర్తికి విరుద్దమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజలకు సంబంధించిన క్లిష్టమైన సమస్యలను లేవనెత్తకుండా ఎంపీలను చేస్తాయని అభిప్రాయపడ్డారు.
ఇటువంటి బహుమతులు ఇచ్చినందుకు ఆశ్చర్యానికి గురయ్యాను. భారతీయ రైల్వేలో భాగంగా నైతికత గురించి ప్రశ్నించానని స్పష్టం చేశారు. సాధారణ ప్రయాణీకుల పట్ల చాలా చులకన భావం ఉంది రైల్వేలలో. ఈ ధోరణి మారాలి. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలి. వందే భారత్ తప్పా కొత్త రైళ్లు ఏవీ ప్రవేశ పెట్టక పోవడం దారుణమని పేర్కొన్నారు ఎంపీ సుదామ ప్రసాద్.
ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వక పోవడం, కాంట్రాక్టు ఉద్యోగులపై వేధింపులు, పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో రైలు సేవలు అందక పోవడం వంటి ప్రధాన అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
నాకు అందజేసిన బంగారం, వెండి నాణాలను కమిటీ సభ్యుల ముందు తిరిగి ఇవ్వాలని స్టాండింగ్ కమిటీ చైర్మన్ ను కోరుతున్నట్లు తెలిపారు ఎంపీ. ఆయన నిజాయితీ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.