నిప్పులు చెరిగిన సీపీఐ నారాయణ
హైదరాబాద్ – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులను ఏకి పారేశారు. అసలు వారికి సోయి అనేది ఉందా అంటూ ప్రశ్నించారు. ఓ వైపు ఉపాధి కరువై, ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే సర్కార్ అందాలు పోటీలు నిర్వహించడం దారుణమన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు దాసోహమైన సీఎం ఇలాంటి వాటిని ప్రోత్సహించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీని పవర్ లోకి తీసుకు వచ్చింది అందాల పోటీలు నిర్వహించేందుకు కాదన్నారు.
దీని వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా పెరుగుతుందో చెప్పాలని నిలదీశారు నారాయణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులను పొట్టు పొట్టు తిట్టారు. వారిపై ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణ అంతటా అందాల భామలు ఎందుకు తిరుగుతున్నారో వారికే తెలియదని పేర్కొన్నారు. వారి వెనకాల కాంగ్రెస్ మంత్రులు సొల్లు కార్చుకుంటూ తిరుగుతుండడం చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తల దించు కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ప్రజలు ఈసడించుకుంటున్నారని ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.