విద్యా రంగంపై ఫోకస్ పెట్టండి – రామకృష్ణ
వైస్ ఛాన్స్ లర్లు..ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయండి
అమరావతి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సందర్బంగా ఆయన కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు. ప్రధానంగా గత పాలనలో విద్యా రంగం కుంటు పడిందని, బడ్జెట్ లో కేటాయింపులు సరే..కానీ ముందుగా విద్యా వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కె. రామకృష్ణ.
రాష్ట్రంలో అత్యున్నత ప్రాధాన్యతా రంగం విద్యా రంగం అని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ప్రధానంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్, యూనివర్సిటీలకు ఉప కులపతులను తక్షణమే నియమించాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో 18 యూనివర్సిటీల్లో 101 విభాగాల్లో 418 ప్రొఫెసర్ పోస్టులు, 801 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 3220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం 2023లో నోటిఫికేషన్ విడుదల చేశారని ఇప్పటి వరకు భర్తీ చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కె. రామకృష్ణ.
ఆయా పోస్టులను భర్తీ చేయడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని వాపోయారు. నోటిఫికేషన్ ఇచ్చిన 4439 యూనివర్సిటీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.