కేజ్రీవాల్ అరెస్ట్ కక్షపూరితం
కన్నెర్ర చేసిన సీపీఐ రామకృష్ణ
అమరావతి – కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ నిప్పులు చెరిగారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
కె. రామకృష్ణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి తప్ప మరోటి కాదన్నారు. ఈ దేశంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కావాలని ప్రతిపక్షాలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. అయినా ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ముందస్తు సమాచారం లేకుండానే , ఎవరో ఆరోపణలు చేసినంత మాత్రాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు కె. రామకృష్ణ. ఇది పూర్తిగా భారత రాజ్యాంగం మూల సూత్రాలకు విరుద్దంగా ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం తప్పని పేర్కొన్నారు . ప్రజలు అన్నింటిని గుర్తు పెట్టుకుంటారని, ఏదో ఒక రోజు మోదీకి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇండియా కూటమిని చూసి భయ పడుతోందని అన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐలను గుప్పిట్లో పెట్టుకుని ఎన్నికల్లో అక్రమ పద్దతుల్లో గెలవాలని చూస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.