యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి
డిమాండ్ చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అమరావతి – పెద్దవాగు ముంపు ప్రాంతాలు, గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇవాళ రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, డేగ ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య తదితరులతో కూడి బృందం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లోని పెద్దవాగు ముంపు ప్రాంతాలలో పర్యటించింది.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. కుంభవృష్టి కారణంగా చాలా చోట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు , కుక్కునూరు మండలాల్లో పెద్ద వాగు ప్రాజెక్టు తెగి పోవటం వల్ల చాలా నష్టం జరిగిందని, వేలాది కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారని తెలిపారు. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలేసి పంట నష్టం జరిగిందని, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ పరిస్థితులపై వెంటనే స్పందించాలాన్నారు. నిన్న ఏపీ మంత్రి పార్థసారథి, ఈరోజు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాంతాల్లో పర్యటించారన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే పెద్దవాగు గండి పడేందుకు కారణమని తెలిపారు.
ఎడతెగని వర్షాల వల్ల, తుఫాను వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల్లో, నష్టాల్లో, కష్టాల్లో ఉన్నారని. తక్షణమే ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ప్రజల్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులకు సక్రమంగా నిధులు కేటాయించక పోవడం వల్ల మరమ్మతులకు నోచుకోక అస్తవ్యస్తంగా మారాయాని ఆరోపించారు కె. రామకృష్ణ.
పెద్దవాగు ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతంలో ఉండగా, ఆయకట్టు ప్రాంతమంతా ఆంధ్ర ప్రాంతంలోనే ఉందని; గతంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో పెద్దవాగుకు గండి పడటానికి ఆస్కారం అయ్యిందన్నారు.