10న ఘనంగా బతుకమ్మ వేడుకలు – సీఎస్
ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆమె బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈనెల 10న గురువారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏకంగా 10 వేల మందికి పైగా మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సందర్బంగా కీలక సూచన చేశారు సీఎస్ శాంతి కుమారి. ఆరోజు సాయంత్రం 4 గంటలకు అమర వీరుల స్మారక స్థూపం నుండి మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటారని వెల్లడించారు సీఎస్.
వీరితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళా రూపాలు ప్రదర్శిస్తారని, వేలాది మంది కళాకారులు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఈ బతుకమ్మ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా హాజరు అవుతారని తెలిపారు సీఎస్. బుద్ద విగ్రహం, సంజీవయ్య పార్కు వద్ద లేజర్ షోలు చేపడతారని అన్నారు.