అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు
తిరుమల – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. వేలాది మంది భక్తులు బారులు తీరారు తిరుమలకు. కోట్లాది మంది భక్తులకు ఇష్ట దైవమైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.
ఇవాళ శ్రీవారి గరుడ సేవ జరగనుంది అత్యంత వైభోపేతంగా. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఈ గరుడ సేవ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
దాపు 2.50 నుంచి 3 లక్షల మందికి పైగా స్వామి వారి అరుదైన సేవను చూసేందుకు వస్తారని టీటీడీ ఇప్పటికే అంచనా వేసింది. ఆ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. ఇక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా బృందాలు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ కళా రూపాలతో భక్తులను అలరించారు. ఐదవ రోజు విశిష్ట జానపద కళారూపాలు భక్తులను ఆశ్చర్య పరిచాయి. వాటిలో పంజాబ్‌లోని కిక్లి, త్రిపురలోని హోజాగిరి, గుజరాత్‌లోని గర్భా వాహన సేవలో ప్రత్యేకంగా నిలిచాయి.
మోహినీ అవతారం ముందు 14 రాష్ట్రాలకు చెందిన 490 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.