ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శనలు
ఘనంగా శ్రీ పద్మావతి అమ్మ వారి ఉత్సవాలు
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 13 కళాబృందాలు 268 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ కోల్‌కత్తాకు చెందిన ఏడు మంది కళాకారులు మనిపూరి నృత్యం, కర్ణాటక రాష్ట్రం మైసూర్ కు చెందిన శ్రీ వల్లభ కోలాటం బృందంలోని 35 మంది చిన్నారులు కోఆర్గి నృత్యం, బెంగుళూరుకు చెందిన 28 మంది మహిళా కళాకారుల గజలక్ష్మి నమోస్తుతే – భరత నాట్యం భక్తులకు నేత్ర పర్వంగా సాగింది.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన 60 మంది యువతులు మాతురి డాన్స్, బంజారా డాన్స్, అదిలాబాద్ జిల్లా సంప్రదాయ నృత్యమైన కొంపు లంబా డ్యాన్స్, రాజమండ్రికి చెందిన 30 మంది మహిళలు కేరళ డ్రమ్స్ లయ బద్ధంగా వాయిస్తూ మాడ వీధులలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంపొందించాయి.
తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు అష్టలక్ష్మి వైభవం వేషధారణ, భరతనాట్యం, కోలాటాలు అలరించాయి.