NEWSANDHRA PRADESH

దానా తుపాన్ తో జర భ‌ద్రం

Share it with your family & friends

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క సూచ‌న చేసింది. ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొంది. వాయువ్య బంగాళా ఖాతంలో దానా తుపాన్ తీవ్ర‌మ‌వుతోంద‌ని హెచ్చ‌రించింది. ఆయా ప్రాంతాల‌లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది వాతావ‌ర‌ణ శాఖ‌.

గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో దానా తుపాన్ కదులుతోంద‌ని తెలిపింది. పారాదీప్ (ఒడిశా)కి 210 కిమీ., ధమ్రా( ఒడిశా)కు 240 కిమీ, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 310 కిమీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంద‌ని వెల్ల‌డించింది ఏపీ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌.

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా – ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటే అవకాశం ఉంద‌ని పేర్కొంది.

మత్స్యకారులు ఎవ‌రూ వేటకు వెళ్ల వ‌ద్దంటూ సూచించింది. తీవ్ర తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృత‌మై ఉంద‌ని తెలిపింది ఏపీ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌. దీని కార‌ణంగా చెదురు మదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురు గాలులు వీస్తాయ‌ని పేర్కొంది. ప్రజలు బలమైన ఈదురు గాలుల పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఏపీ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ రోణంకి కూర్మ‌నాథ్.