బీఆర్ నాయుడుకు పురందేశ్వరి కంగ్రాట్స్
తనను కలుసుకున్న సందర్బంగా అభినందన
అమరావతి – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి చైర్మన్ గా నియమితులైన టీవీ5 అధిపతి బీఆర్ నాయుడు తో పాటు పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి మర్యాద పూర్వకంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ , రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా శ్రీవారి ప్రసాదాన్ని ఆమెకు అందజేశారు.
చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు భాను ప్రకాశ్ రెడ్డిని అభినందించారు ఎంపీ. తిరుమలకు పూర్వ వైభవాన్ని తీసుకు రావాలని, సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని, ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగించేలా చూడాలని సూచించారు దగ్గుబాటి పురందేశ్వరి చైర్మన్ బీఆర్ నాయుడుకు.
అదే విధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి ఎనలేని ఆదరణ ఉందన్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలను కూడా ఈ సందర్బంగా ప్రస్తావించారు దగ్గుబాటి పురందేశ్వరి. ఇదిలా ఉండగా ఎంపీకి తిరుమల పవిత్రతను కాపాడేందుకు శాయ శక్తులా కృషి చేస్తానని చెప్పారు టీటీడీ చైర్మన్.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు శ్రీ భానుప్రకాష్ రెడ్డి సైతం పాలకమండలి సభ్యులుగా నియమితులైన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం కూడా పాల్గొన్నారు.