జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే – పురంధేశ్వరి
వైసీపీ చీఫ్ ను డిమాండ్ చేసిన బీజేపీ చీఫ్
అమరావతి – భారతీయ జనతా పార్టీ ఏపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదం ఓ వైపు కొనసాగుతుండగా మరో వైపు వైసీపీ బాస్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వెళుతుండడం ఉత్కంఠ రేపుతోంది. దీనిపై ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కూటమికి చెందిన పార్టీల నేతలు ఎవరూ కూడా స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ వ్యవహారం కూటమికి సంబంధించిన వ్యవహారం కాదని పేర్కొన్నారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా శుక్రవారం బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి వైస్ జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
జగన్ మోహన్ రెడ్డి బేషరతుగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని, ఆ తర్వాతే శ్రీ వేంకటేశ్వర స్వామిని , అలివేలు మంగమ్మలను దర్శించు కోవాలని స్పష్టం చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్య మతస్తులు ఎవరైనా సరే దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
గత ప్రభుత్వంలో సీఎం హోదాలో జగన్ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా తిరుమల వెళ్లారని గుర్తు చేశారు.