ఏపీకి అమరావతే రాజధాని
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు
విజయవాడ – ఇప్పటికే కాదు ఎల్లప్పటికీ అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం పురస్కరించుకుని ఉగాది వేడుకలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కేంద్రంపై విపక్షాలు బురద చల్లుతున్నాయని, తాము విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నట్లు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ వ్యక్తుల పరం కానివ్వమని స్పష్టం చేశారు దగ్గుబాటి పురందేశ్వరి. అయతే కంపెనీ బలోపేతానికి పెట్టుబడులు మాత్రం ఆగవని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్నారు. పోలవరం డిజైన్ లో మార్పులు ఎందుకు చేశారని ప్రశ్నించారు. పాలన గాడి తప్పిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి పొత్తు పెట్టుకున్నామని కుండ బద్దలు కొట్టారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు దగ్గుబాటి పురందేశ్వరి. ఉగాది పండుగ తెలుగు వారికి మాత్రమే కాదని భారత దేశానికి అత్యంత ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు.