కూటమి కలయిక చారిత్రక అవసరం
బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి – ఏపీ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం చారిత్రిక అవసరమని స్పష్టం చేశారు బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం మన ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని, అయితే టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ హై కమాండ్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమమని పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం అరాచక సర్కార్ కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దీనిని గద్దె దించేందుకు కూటమి ప్రయత్నం చేయాలని కోరారు. పొత్తుల కారణంగా చాలా మందికి టికెట్ రాలేదని, ఇందులో వాస్తవం ఉందన్నారు. ఈ విషయాన్ని ఆయా పార్టీల హైకమాండ్ లు గుర్తించాయని తెలిపారు. వారికి అధికారంలోకి వచ్చాక కూటమి తరపున న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు దగ్గుబాటి పురందేశ్వరి.
వైసీపీ సర్కార్ అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లోకి తీసుకుందన్నారు. ఇదే క్రమంలో దొంగ ఓట్లను నమోదు చేయించిందని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డికి మూడిందని, ఆయనను మార్చాలని జనం డిసైడ్ అయ్యారని అన్నారు.