ఆరోగ్య శాఖలో 4356 పోస్టుల భర్తీ
ప్రకటించిన రాష్ట్ర సర్కార్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అధ్యాపకుల, సిబ్బంది కొరతను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం , రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీ లలో అక్టోబర్ – 2021 నుండి ఖాళీగా ఉన్న 4356 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకూలంగా స్పందించారు. ఈ మేరకు వెంటనే పోస్టులను భర్తీ చేయాలని ఆమోదించారు.
దీనిలో భాగంగా 4356 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 98. తేదీ 11/3/2024న జీవోను విడుదల చేయడం జరిగిందని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1459, ట్యూటర్లు 412, సీనియర్ ప్రెసిడెంట్ 1201 జాబ్స్ భర్తీ చేస్తామన్నారు.
ఈ నిర్ణయంతో ప్రతి సంవత్సరం 634 కోట్ల 48 లక్షల రూపాయల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పై పడుతుందని మంత్రి వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 6958 స్టాప్ నర్సులను నియమించడం జరిగిందన్నారు.