NEWSTELANGANA

ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా..?

Share it with your family & friends

దామోద‌ర రాజ న‌ర‌సింహ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ నేత‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా దామోద‌ర స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

గత ప్రభుత్వం హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్, వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు 06/09/2018న జీవో 520 విడుదల చేశారని తెలిపారు. కానీ, ఒక్క హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకు రాలేద‌ని ఆరోపించారు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌.

పేట్లబుర్జు, ఎంజీఎంలో పైసా పని చేయలేదన్నారు. ఒక్క పరికరం కూడా కొనుగోలు చేయలేదని మండిప‌డ్డారు. 2023లో ఎన్నికలకు ముందు గాంధీకి కొన్ని ఎక్విప్‌మెంట్స్ (ప‌రిక‌రాలు) తీసుకొచ్చి, ఐవీఎఫ్ సేవలను ప్రారంభిస్తున్నట్టు హడావుడి చేశారని ఆరోపించారు మంత్రి.

కానీ, అక్కడ ఎంబ్రయాలజిస్ట్, స్టాఫ్‌ను నియమించ లేద‌ని పేర్కొన్నారు. అవసరమైన అనుమతులు తీసుకోలేదని మండిప‌డ్డారు. ఐవీఎఫ్ చేయడానికి అవసరమైన కెమికల్స్, మెడిసిన్ కొనడానికి నిధులు మంజూరు చేయలేదని అన్నారు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌.

ఇవన్నీ త‌మ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించాం, ట్రైన్‌డ్ స్టాఫ్‌ను అలాట్ చేశాం. నిధులు కేటాయించామ‌ని తెలిపారు.
అవసరమైన అనుమతులు తీసుకొచ్చి, ఐవీఎఫ్ సేవలను ప్రారంభించామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి.

తాము చిత్తశుద్ధితో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తే, దాన్ని మీ ఖాతాలో‌ వేసుకునేందుకు చవకబారు‌ విమర్శలు‌ చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. మీకు దమ్ముంటే మీ హయాంలో గాంధీలో ఒక్కరికి ఐవీఎఫ్ చేసినట్టు నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌.