సీఎం బ్రదర్స్ పై కేసు నమోదు చేయాలి
మాజీ సర్పంచ్ మృతి బాధాకరం
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నారు.
మాజీ సర్పంచ్ ను వేధింపులకు గురి చేశారని మృతుడు లేఖ రాసి సూసైడ్ చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చావుకు కారకులు రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని రెండు సార్లు చాలా స్పష్టంగా మృతుడు తన సూసైడ్ నోటి లో పేర్కొన్నాడని తెలిపారు. ఇది ముమ్మాటికీ తీవ్రమైన నేరమేనని స్పష్టం చేశారు దాసోజు శ్రవణ్ కుమార్.
మృతుడిది అసహజ మరణం (unnatural death) ఐనప్పుడు, ఆయన సూసైడ్ నోట్ రాసి , అందులో తన చావుకు కారణమైన వారి పేర్లు రాసినప్పుడు సుమోటో గా 194 (బీఎన్ఎస్ఎస్) ప్రకారం ఎఫ్ఐఆర్ చేయాల్సిందేనని అన్నారు .. ఇది ముమ్మాటికి కాగ్నిజబుల్ అఫెన్సు. 108 బీఎన్ఎస్ కింద ఇది తీవ్రమైన నేరం అవుతుందన్నారు. నేరం రుజువైతే నిందితులకు 8 సం.ల వరకు జైలుశిక్ష పడుతుందన్నారు.
రాష్ట్రంలో రోజు రోజుకు పాలన గాడి తప్పుతోందని ఆవేదన చెందారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు దాసోజు శ్రవణ్ కుమార్.