నోటీసులు లేకుండా కూల్చేస్తే ఎలా ..?
బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని ఆరోపించారు. హైడ్రా పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చి వేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని , మూర్ఖపు నాయకత్వం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని, ఇది మంచి పద్దతి కాదన్నారు.
న్యాయ పరమైన విస్తృత విధి విదానాలు లేకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు అని నిలదీశారు . ప్రజల ఆస్తులను కూలుస్తూ బుల్డోజర్ పాలనను అమలు చేయడం దారుణమన్నారు దాసోజు శ్రవణ్ కుమార్.
ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా దాసోజు శ్రవణ్ కుమార్ స్పందించారు. సమగ్రమైన చర్చ లేకుండా , దీర్ఘ కాలిక ఆలోచన లేకుండా, నిర్దిష్టమైన ప్లాన్ అంటూ అమలు చేయకుండానే చెరువుల పేరు చెప్పి కూల్చడం భావ్యం కాదన్నారు.
కేవలం ప్రజలలో తాను హీరో అనిపించుకునేందుకే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నాడని ఆరోపించారు దాసోజు శ్రవణ్ కుమార్. ఇదిలా ఉండగా హైడ్రా భారీ ఎత్తున కూల్చివేతలకు పాల్పడింది. దీంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.