కొండా సురేఖ కామెంట్స్ సై దాసోజు ఫైర్
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ సీనియర్ నేత
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తమ పార్టీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తనయుడు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు దాసోజు శ్రవణ్ కుమార్. సోయి లేకుండా మాట్లాడటం, ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం కొండా ఫ్యామిలీకి అలవాటుగా మారి పోయిందని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
స్వంత కొడుకును పట్టుకుని తన తండ్రిని తానే గొంతు పిసికి చంపేసి ఉంటాడని, తల పగొల గొట్టి ఉంటాడని, చంపి పూడ్చి పెట్టి ఉంటాడంటూ ఆధారాలు లేని నిస్సిగ్గుగా కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ ఇలాంటి జుగుస్సాకరమైన, సభ్య సమాజం సిగ్గు పడేలా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు దాసోజు శ్రవణ్ కుమార్. ఇంత దిగజారుడు, నేర పూరిత మాటలు మాట్లాడుతున్న ఆమెను వెంటనే కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు శ్రవణ్ కుమార్.