యువకుల దుర్మరణం బాధాకరం – సీఎం
తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
అమరావతి – తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీ కడుతూ వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అనే నలుగురు మృతి చెందడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఇంఛార్జి మంత్రిగా ఉన్న నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు, ఏపీ రాష్ట్ర హోం , విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి సాయం అందించాలని ఆదేశించారు.