చిక్కుకు పోయిన 20 మంది..10 మంది సేఫ్
ఢిల్లీ – ఢిల్లీలోని బురారీలో నాలుగంతస్తుల భవనం కుప్ప కూలింది. ఘటన సమయంలో భవనంలో దాదాపు 20 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అంచనా. ఇప్పటి వరకు 10 మందిని రక్షించారు రెస్క్యూ టీమ్స్. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఎం అతిషి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ఢిల్లీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని స్పష్టం చేశారు సీఎం అతిషి సింగ్. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. త్వరిత ఉపశమనం పొందేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలలో పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక సేవలు, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) పాల్గొంటున్నాయి.
భవనం లోపల చిక్కుకున్నట్లు భావిస్తున్న ప్రజలకు త్వరితగతిన సహాయ, రక్షణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి స్థానిక పరిపాలనను ఆదేశించారు.