అన్ని సర్వేలు కమలం వైపే
ఢిల్లీ – ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 స్థానాలకు 699 మంది పోటీ పడ్డారు. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ , కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ తో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ సందర్బంగా అన్ని సర్వే సంస్థలు, మీడియా సంస్థలన్నీ గంప గుత్తగా నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో పాగా వేయబోతోందంటూ స్పష్టం చేశాయి.
ఆయా సర్వే సంస్థలకు సంబంధించి చూస్తే.. పీపుల్స్ పల్స్ బీజేపీకి 51 నుంచి 60 సీట్లు, ఆప్ కు 10 నుంచి 19 సీట్లు, కాంగ్రెస్ కు ఒక్క సీటు రాదని పేర్కొంది. ఏబీపీ – మ్యాట్రిజ్ బీజేపీకి 35 నుంచి 40 సీట్లు, ఆప్ కు 32 నుంచి 37 సీట్లు, కాంగ్రెస్ కు 1 సీటుకే పరిమితం అవుతుందని తెలిపింది.
టైమ్స్ నౌ ఛానెల్ బీజేపీకి 39 నుంచి 45 సీట్లు, ఆప్ కు 29 నుంచి 31 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జేఏసీ సంస్థ బీజేపీకి 35 నుంచి 40 సీట్లు, ఆప్ కు 32 నుంచి 37 సీట్లు, కాంగ్రెస్ ఒక సీటుకే పరిమితవుతుందని తెలిపింది.
పీపుల్స్ ఇన్ సైట్ సంస్థ బీజేపీకి 40 నుంచి 44 సీట్లు, ఆప్ కు 25 నుంచి 29 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు, చాణక్య స్ట్రాటజీ బీజేపీకి 39 నుంచి 44 సీట్లు, ఆప్ కు 25 నుంచి 28 సీట్లు , కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 3 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
పీ మార్క్ బీజేపీకి 39 నుంచి 49 సీట్లు , ఆప్ కు 21 నుంచి 31 సీట్లు, కాంగ్రెస్ కు 1 సీటు , కేకే సర్వే బీజేపీకి 22 సీట్లు, ఆప్ కు 39 సీట్లు వస్తాయని ప్రకటించింది.