ఢిల్లీ ఎల్జీని కలిసిన నూతన సీఎం
అతిషి సింగ్ తో పాటు కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన లేఖను నేరుగా ఢిల్లీ లెఫ్లినెంట్ గవర్నర్ సక్సేనాకు అందజేశారు. ఆయనతో పాటు ఎవరు సీఎంగా ఉంటారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రస్తుతం ఢిల్లీ కేబినెట్ లో విద్యా శాఖ మంత్రిగా ఉన్న అతిషి సింగ్ ను ముఖ్యమంత్రి పదవికి సిఫారసు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఆప్ బాస్ , మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఇది ఊహించని పరిణామం. ఏదో రకంగా కేజ్రీవాల్ ను జైలుపాలు చేసి ఆప్ ను మట్టి కరిపించాలని ప్లాన్ వేసింది భారతీయ జనతా పార్టీ. కానీ కాషాయ దళానికి బిగ్ షాక్ ఇస్తూ కేజ్రీవాల్ ఎత్తుకు పై ఎత్తు వేశారు. తాను ముందస్తుగానే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక సమావేశంలో వెల్లడించారు అరవింద్ కేజ్రీవాల్. తనపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎలాంటి ఆధారాలు లేక పోయినా తనను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు కేజ్రీవాల్.
తను అవినీతి పరుడినో లేదా అన్నది ఈసారి ఢిల్లీలో జరిగే శాసన సభ ఎన్నికల్లో తేలి పోతుందని ప్రకటించారు. మొత్తంగా రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయనడంలో సందేహం లేదు.