రాహుల్ గాంధీపై కేసు నమోదు
ఫిర్యాదు చేసిన కేంద్ర మంత్రి ఠాకూర్
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ . తమ పార్టీకి చెందిన ఎంపీపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. దీంతో ఎంపీ సారంగికి తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం తను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తమ ఎంపీని తోసి వేశారంటూ ఆరోపించారు.
రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. 109, 115, 117, 125, 131 మరియు 351 సెక్షన్ల కింద ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పదే పదే ఇండియా కూటమి నేతలు అంబేద్కర్ జపం చేస్తున్నారని , ఆయన ఏమైనా దేవుడా అంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్లమెంట్ భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకునే ప్రయత్నం చేశారు బీజేపీ ఎంపీలు. దీంతో తోపులాట చోటు చేసుకుంది.