సీఎం చంద్రబాబు నాయుడు
ఢిల్లీ – ఢిల్లీ రాష్ట్ర అభివృద్ది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. చెత్తా చెదారానికి దేశ రాజధాని కేరాఫ్ గా మారిందంటూ మండిపడ్డారు. మనందరి ఆత్మ గౌరవం ఈ ప్రాంతం. దీనిని పరిశుభ్రంగా ఉంచడంలో ఆప్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. గత పదేళ్లుగా పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి అవుతోందన్నారు. కేజ్రీవాల్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు.
సోమవారం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. మన దేశానికి వచ్చే విదేశీయులు ముందుగా వచ్చేది ఢిల్లీకేనని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక వెదర్ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్ ఢిల్లీలోనే ఉందన్నారు.
చేసిన పనులు ఫలితాలు ఇవ్వక పోవడంతో కేజ్రీవాల్ ఏవేవో చెప్పి ప్రజల్ని పొల్యూట్ చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ గల్లీల్లో మురికినీరు, మంచినీరు కలిసి పోవడంతో ప్రజలు కలుషిత నీరు తాగుతున్నారని అన్నారు.
ఢిల్లీలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే కనిపిస్తోందన్నారు. యమునా నది మొత్తంగా కలుషితమైంది. వాయు కాలుష్యం అయితే భరించలేని స్థితిలో ఉందన్నారు. ఢిల్లీకి ఎవరూ వచ్చేందుకు ఇష్టపడటం లేదన్నారు.