నా ఇల్లు అక్రమమని తేలితే కూల్చేయండి
రేవంత్ రెడ్డి సోదరుడు ఎ. తిరుపతి రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎ. తిరుపతి రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై , అక్రమ నిర్మాణాలపై ఆయన గురువారం స్పందించారు. మీడియాతో మాట్లాడిన తిరుపతి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తన ఇల్లు గనుక అక్రమంగా నిర్మించినట్లు తేలితే హైడ్రా కూల్చేయ వచ్చని స్పష్టం చేశారు. ఇందులో ఎవరికి అనుమానం అక్కర్లేదన్నారు. తన సోదరుడు సీఎం అయినంత మాత్రాన అక్రమాలను ప్రోత్సహించరని పేర్కొన్నారు తిరుపతి రెడ్డి.
తనకు సమయం ఇస్తే తానే సామాన్లు తీసుకుని బయటకు వెళతానని చెప్పారు. శేర్ లింగంపల్లి రెవెన్యూ అధికారులు తనకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని చెప్పారు. అయితే ఇప్పటి వరకు తన వద్దకు ఏ అధికారి వచ్చి కలవ లేదన్నారు .
తాను 2016-17లో అమర్ సొసైటీలో ఇల్లును కొనుగోలు చేశానని చెప్పారు తిరుపతి రెడ్డి. ఆనాడు కొన్నప్పుడు అది ఎఫ్టీఎల్ లో ఉందన్న సమచారం తనకు తెలియదన్నారు. నా ఇల్లు బఫర్ జోన్ లో ఉందని, వాల్టా చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు తిరుపతి రెడ్డి. 1995లో ఈ లే ఔట్ కు అనుమతి వచ్చిందని చెప్పారు. అయితే బీఆర్ఎస్ వాళ్లు కావాలని దీనిని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.