బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
అమరావతి – అన్నమయ్య జిల్లా గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకి రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు దిశానిర్దేశం చేశారు.
మరో వైపు అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో శివ స్వాములు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు మంత్రి వంగలపూడి అనిత. ఈ సందర్బంగా ఎస్పీ వి. విద్యా సాగర్ తో ఫోన్ లో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.