మరాఠా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
డిప్యూటీ సీఎంలుగా షిండే..అజిత్ పవార్
మహారాష్ట్ర – మరాఠా పీఠం పీటముడి వీడింది. నిన్నటి దాకా ఎవరు సీఎంగా కొలువు తీరుతారనే ఉత్కంఠకు తెర దించింది మహాయుత కూటమి. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు అందరినీ విస్తు పోయేలా చేశాయి. ఫలితాలు వెలువడినా సీఎంగా నిర్ణయం తీసుకోక పోవడంపై రాష్ట్రపతి పాలన విధించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.
ఎట్టకేలకు కూటమి నుంచి నిర్ణయం వెలువడింది. డిసెంబర్ 5న గురువారం మరాఠా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కొలువు తీరనున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ప్రస్తుత ఆపద్దర్మ సీఎం గా ఉన్న ఏక్ నాథ్ షిండేతో పాటు ఎన్సీపీ పవార్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదిలా ఉండగా ఈసారి బీజేపీకి అనూహ్యంగా 132 సీట్లు వచ్చాయి. దీంతో ఆ పార్టీ నుంచే సీఎంగా ఉండాలని పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. మరో వైపు షిండే తాను కూడా బరిలో ఉన్నానంటూ ప్రకటించారు. ఎట్టకేలకు రాజీ మార్గం ఫలించింది. చివరకు సీఎం పదవి ఎంపిక విషయంలో సాక్షాత్తు పీఎం మోడీ, అమిత్ షా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.