టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటన
హైదరాబాద్ – టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ , నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంతో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం ముగిసింది. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం అందుతోందన్నారు తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగేలా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారని తెలిపారు.
సామాజిక కార్యక్రమాల్లో ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ఉండాలని ప్రభుత్వం కోరిందని చెప్పారు. డ్రగ్స్, గంజాయిపై పోరాటంలో సినిమా హీరోలు పాల్గొంటారని ప్రకటించారు దిల్ రాజు. కొన్ని ఘటనల వల్ల ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరిగిందన్నారు. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదన్నారు.
ప్రధానంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఏమేం కావాలనే దాని గురించి తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగిందన్నారు. ఆయన అన్నింటికి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. చిత్ర పరిశ్రమ బాగుండాలన్నదే తమ అభిమతని సీఎం స్పష్టంగా తమకు తెలియ చేశారని , సినీ ఇండస్ట్రీ ఎక్కడికీ పోదన్నారు. హైదరాబాద్ లోనే భద్రంగా ఉంటుందని అన్నారు దిల్ రాజు.