బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
విజయవాడ – అంబేద్కర్ ని అవమానించి, రాజ్యాంగానికి గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అంబేద్కర్ ఆలోచనలను ఒక సంకల్పం గా భావించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలు 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా ఏపీ పార్టీ కార్యాలయంలో శ్రీకారం చుట్టామన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పై అనేక ఆరోపణలు చేసిందన్నారు. కానీ జనం నమ్మలేదన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని అబద్దపు ప్రచారాలు చేసిన వాటిని ప్రజలు తిప్పి కొట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని ఎన్నో సార్లు అవమాన పరిచిందంటూ ఆరోపించారు డీకే అరుణ. అంబేద్కర్ ఆశయాలకి తూట్లు పొడిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ అని ప్రజలందరు గమనించారని అన్నారు. ప్రజా హితం, దేశ హితం కోసం బీజేపీ రాజ్యాంగ సవరణలు చేపట్టిందన్నారు. లోకసభ ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడించిందని ధ్వజమెత్తారు.
బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు . ఈనెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నామన్నారు. ఆయన స్పూర్తి తో బూత్ లెవల్ లో కార్యక్రమాలు చేపట్టామన్నారు. సమ సమాజ స్థాపన కోసం అంబేడ్కర్ కృషి చేశారని కొనియాడారు. అన్ని వర్గాల వారికి సమాన న్యాయం అందించడం ఆయన లక్ష్యమన్నారు. అదే ఆదర్శంగా బిజెపి పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని చెప్పారు. నిజానికి అంబేద్కర్ ను గౌరవించి సమున్నత స్థానం కల్పించింది బిజెపినే అని స్పష్టం చేశారు. భారతరత్న ఇచ్చినా, పార్లమెంటు లో చిత్ర పటం పెట్టినా కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోయిందన్నారు.