బీజేపీకి అంత సీన్ లేదు
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కర్ణాటక – పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగడం ఖాయమని స్పష్టం చేశారు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి వాపు చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము ఎన్నికల సందర్బంగా చెప్పిన ఐదు హామీలను అమలు చేయడం జరిగిందని చెప్పారు.
అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, కానీ బీజేపీ రాజకీయ లబ్ది కోసం కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రయోజనం పొందాలని అనుకుంటోందని ఆరోపించారు డీకే శివకుమార్. ప్రధాన మంత్రి చెప్పేవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు. ఆయన కొలువు తీరాక బీజేపీ సంకీర్ణ సర్కార్ చేసిన మోసం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.
కేవలం బడా బాబులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేందుకు మోదీ పని చేస్తున్నారని దేశం కోసం మాత్రం కాదన్నారు డీకే శివకుమార్. ఇక లోక్ సభ ఎన్నికల్లో చిత్తుగా బీజేపీ ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు.