అమెరికా పర్యటనపై డీకే క్లారిటీ
వ్యక్తిగత పనుల మీదే వెళుతున్నా
కర్ణాటక – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను అమెరికాలో పర్యటనకు సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
అవన్నీ పుకార్లు తప్ప మరోటి కాదన్నారు డీకే శివకుమార్. తన అమెరికా పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, ఇది ఎలాంటి రాజకీయ పర్యటన కాదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. అక్కడి నుంచి తనను ఎవరూ ఆహ్వానించ లేదని తెలిపారు.
పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు డీకే శివకుమార్. ఇదిలా ఉండగా కర్ణాటకలో ప్రస్తుతం వాల్మీకి స్కాం కలకలం రేపుతోంది. ఇందులో ప్రధానంగా ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య తో పాటు ఆయన కుటుంబం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఇదే సమయంలో విచారణకు ఆదేశించారు రాష్ట్ర గవర్నర్. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు సీఎం సిద్దరామయ్య. ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన అని ఆరోపించారు. తాము కోర్టును ఆశ్రయిస్తామని, న్యాయం తమ వైపు ఉందని పేర్కొన్నారు. కేంద్రం కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మొత్తంగా ఈ కీలక సమయంలో డీకే శివకుమార్ అమెరికా టూర్ కలకలం రేపుతోంది.