మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్
అమరావతి – మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన ఎంపీలు విజయ సాయి రెడ్డి, అయోధ్యా రెడ్డిలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంపై స్పందించారు. వారి నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సజ్జల రామకృష్ణా రెడ్డి నిర్వాకం కారణంగానే పార్టీ నాశనమైందని ఆరోపించారు. తాను బయటకు రావడానికి కూడా తనే కారణమని ఆరోపించారు. సజ్జల ఆంధ్రా శశికళ అంటూ నిప్పులు చెరిగారు.
ఆ ఇద్దరు ఎంపీలు తమ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం అభినందనీయమని అన్నారు డొక్కా మాణిక్యవర ప్రసాద్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలను నాశనం చేసింది ఎవరో జనానికి తెలుసన్నారు. ఎవరికీ స్వేచ్ఛ లేకుండా అన్నీ తానై వ్యవహరించారంటూ సజ్జల రామకృష్ణా రెడ్డిని ఏకి పారేశారు.
ఆయన వల్లనే అధికారానికి వైసీపీ దూరమైందని ఆరోపించారు. పార్టీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని , ఇష్టానుసారంగా వ్యవహరించడం , మోనార్క్ గా భావించడం వల్లే 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. చివరకు వైసీపీ ఖాళీ కావడం ఖాయమని జోష్యం చెప్పారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్.