మీ ఆశిస్సులు దేవుడి దీవెనలు గెలిపించాయి
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికా – అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాడు. దేశ రాజకీయ చరిత్రలో చరిత్రాత్మకమైన గెలుపు సాధించారు. ఆయన 47వ అధ్యక్షుడు కాబోతున్నారు. ఈ సందర్బంగా దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. అమెరికన్ల ఆశీస్సులు..ఆ దేవుడి దీవెనలు తనను కాపాడాయని, గెలుపొందేలా చేశాయని చెప్పారు డొనాల్డ్ ట్రంప్.
ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఒక కారణంతో తన ప్రాణాన్ని కాపాడాడని అన్నారు. నా వయసు ఇప్పుడు 78 ఏళ్లు. గట్టిగానే ఉన్నా. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటానని, అమెరికాను సూపర్ పవర్ గా చేస్తానని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్.
900కు పైగా ర్యాలీలు, సభలు నిర్వహించడం జరిగిందన్నారు. బహుశా తన పొలిటికల్ కెరీర్ లో మరిచి పోలేనని అన్నారు. చాలా కష్ట పడ్డానని అన్నారు. తన గెలుపు కోసం భార్య, కూతుళ్లు, కుటుంబం మొత్తం తన వెనుక నిలిచారని చెప్పారు డొనాల్డ్ ట్రంప్.
తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ప్రజలకు అద్భుతమైన విజయంగా పేర్కొన్నారు. గత జూలై 13న తనపై జరిగిన హత్యా యత్నాన్ని కూడా ప్రస్తావించారు ట్రంప్. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అమెరికా అభివృద్ది కోసం పాటు పడతానని ప్రకటించారు. ప్రధానంగా జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా రాష్ట్రాల ప్రజలకు తాను రుణపడి ఉన్నానని స్పష్టం చేశారు.