బాలినేని శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకోవద్దు
జన విజ్ఞాన వేదిక చీఫ్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి
గుంటూరు జిల్లా – గత 5 సంవత్సరాల కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన అక్రమాలకు ,అవినీతికి రక్షణ కవచంగా ఉండటానికి ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల లోకి చేరటానికి ప్రయత్నిస్తున్నారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ఆరోపించారు.
బాలినేని అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పుర0ధేశ్వరిలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గతంలో చేసిన అవినీతి అక్రమాలను దృష్టిలో ఉంచుకొని వారి పార్టీలలో చేర్చుకోరాదని కోరారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు భూకబ్జాలు చేస్తూ దొంగ రిజిస్ట్రేషన్ లతో ఒంగోలు పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు. వీటి పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సిట్ ను పునరుద్ధరించి దర్యాప్తు ను వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
పోతురాజు కాలువ ఆధునీకరణ కోసం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మద్యలో ఆ పని నిలిపి వేసినారని ఆ సమయంలో నిర్మించిన సైడ్ వాల్ కొద్దిపాటి వర్షానికే కూలి పోయిందని ఇందులో జరిగిన అక్రమాలలో బాలినేని పాత్ర ఉందన్నారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి బంధువు నిర్మిస్తున్న విల్లాల లెవలింగ్ కోసం అక్రమంగా కోట్లాది రూపాయల గ్రావెల్ తరలించడం ,విల్లాల నిర్మాణం లో వాగు పోరంబోకును కలుపు కోవటం పై దర్యాప్తు జరగాలన్నారు.
ఇసుక, మట్టి, గ్రానైట్ అక్రమాల తవ్వకాలపై భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి నిరోధకునిగా బాలినేని వ్యవహరించారని అభివృద్ధి పై దృష్టి పెట్టకుండా పేకాట, బెట్టింగ్ లాంటి వ్యసనాలకు లోనై రాజకీయాలను బ్రష్టు పట్టించారన్నారు.
వెలిగొండ ప్రాజెక్ట్ నేటికీ పూర్తి కాలేదని గుండ్లకమ్మ ప్రాజెక్టు లో గేట్లు కొట్టుకుపోతే వాటిని సైతం పునరుద్ధరించ లేదన్నారు. ఎలాంటి వ్యాపారాలు పరిశ్రమలు నిర్వహించకుండా వందలాది కోట్ల రూపాయలు రాజకీయాల్లో ఎలా సంపాదించారో బాలినేని బహిర్గతం చేయాలన్నారు.
బహిరంగంగా పేకాట ఆడుతానని, బెట్టింగ్ లు పెడతానని, రాజకీయ అవినీతికి పాల్పడుతున్నానని ప్రకటించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ని ఏ రాజకీయ పార్టీ చేర్చుకోరాదని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి కోరారు.