దేశం మరువని మహనీయుడు
కోట్లాది మందికి స్పూర్తి ప్రదాత
భారత దేశ రాజ్యాంగానికి ఊపిరి పోసిన మహోన్నత మానవుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. ఆయన జయంతి ఇవాళ. కోట్లాది మందిని నేటికీ 75 ఏళ్లవుతున్నా ఇంకా స్మరించుకుంటూనే ఉన్నారు. బాబా సాహెబ్ నడిచిన బాటలో అడుగులు వేస్తున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, ప్రతి ఒక్కరికీ సమాన భాగస్వామ్యం, సామాజిక న్యాయం అన్నది అందాలని పరితపించిన వ్యక్తి. నిమ్న కులాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని పోరాడిన ధీశాలి. తన జీవిత కాలమంతా దేశం కోసం , భవిష్యత్తు కోసం పరితపించిన అరుదైన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాతగా , తొలి దేశపు న్యాయ శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆలోచనా పరుడిగా, ఆర్థిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా , సంఘ సంస్కర్తగా పేరు పొందారు అంబేద్కర్. ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారంగా భావించే భారత రత్నను ప్రకటించింది. ఏప్రిల్ 14, 1891లో పుట్టారు. డిసెంబర్ 6, 1956లో లోకాన్ని వీడారు. ఈ మధ్య కాలంలో ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. తాడితులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలని కుండ బద్దలు కొట్టారు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. సమాజంలో పేరుకు పోయిన అంటరానితనం, కుల నిర్మూలన, మత మౌఢ్యంపై పోరాటం చేశారు.
కొలంబియా యూనివర్శిటీ నుండి పీహెచ్ డీ, లండన్ యూనివర్శిటీ నుండి డాక్టరేట్ పట్టాలను పొందాడు. అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు అంబేద్కర్. మొదట న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆ తర్వాత అధ్యాపకుడిగా, ఆర్థిక వేత్తగా పని చేశారు. పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు. 1956లో బౌద్ద మతం స్వీకరించాడు. అనేక అవమానాలు భరించి చివరకు దేశానికి స్పూర్తి దాయకమైన నాయకుడిగా, మార్గదర్శకుడిగా నిలిచారు డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్. ఆయన లేక పోయినా అందించిన స్పూర్తి పదికాలాల పాటు ఉంటుంది.