NEWSINTERNATIONAL

శ్రీ‌లంక ప్ర‌ధాన‌మంత్రిగా హ‌రిణి అమ‌రసూర్యా

Share it with your family & friends

ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న నేత

శ్రీ‌లంక – శ్రీ‌లంక దేశ అధ్య‌క్షుడిగా అనుర కుమార దిస‌నాయ‌కే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో కీల‌క ప‌ద‌వుల‌లో ఉన్న వారికి స్థాన చ‌ల‌నం ప్రారంభ‌మైంది. త‌న‌కు ఆమోద యోగ్యంగా ఉండే వారికి ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ఇందులో భాగంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు శ్రీ‌లంక దేశ అధ్య‌క్షుడు. ప్ర‌స్తుతం ఉన్న పార్ల‌మెంట్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తాజాగా న‌లుగురికి కొత్త కేబినెట్ లో చోటు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు అనుర కుమార దిస‌నాయ‌కే. ఇదిలా ఉండ‌గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా శ్రీ‌లంక దేశ ప్ర‌ధాన మంత్రిగా ప్ర‌ముఖ మేధావిగా గుర్తింపు పొందిన డాక్ట‌ర్ హ‌రిణి అమ‌ర సూరియాను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు అనుర కుమార దిస‌నాయ‌కే.

ఆమెతో పాటు మంత్రులుగా విజితా హెరాత్ , ల‌క్ష్మ‌ణ్ నిపుణ అరాచ్చికి ఛాన్స్ ఇచ్చారు. వీరంతా ఇవాళ ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు దేశాధ్య‌క్షుడు ప్ర‌క‌టించ‌డం విశేషం. అయితే ఈ ఏడాది న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్ లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు దిస‌నాయ‌కే. కీల‌క‌మైన పోస్టులో కొలువు తీర‌నుండ‌డంతో ఎవ‌రీ హ‌రిణి అనేది ఉత్కంఠ‌గా మారింది.

ఆమెకు ఇప్పుడు 54 ఏళ్లు. మార్చి 6, 1970లో కొలంబోలో పుట్టారు. 2020లో నేష‌న‌ల్ పీపుల్స్ ప‌వ‌ర్ పార్టీలో ఉన్నారు. జ‌న‌తా విముక్తి పెర‌మున‌లో కూడా కొన‌సాగుతూ వ‌చ్చారు. సామాజిక కార్య‌క‌ర్త‌గా, మ‌హిళా హ‌క్కుల నాయ‌కురాలిగా , మేధావిగా గుర్తింపు పొందారు డాక్ట‌ర్ హ‌రిణి అమ‌ర సూర్య‌. యూనివ‌ర్శిటీలో అధ్యాప‌కురాలిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం 16వ ప్ర‌ధాన‌మంత్రిగా శ్రీ‌లంక‌లో కొలువు తీరారు.

నేష‌న‌లిస్ట్ పార్ల‌మెంట్ స‌భ్యురాలిగా ఉన్నారు. ఆమె త‌న‌ను తాను ఉదార‌వాదిగా పేర్కొంటూ వ‌చ్చారు. ఇప్ప‌టి దాకా యువ‌త‌, నిరుద్యోగం, లింగ అసమాన‌త‌, పిల్ల‌ల ర‌క్ష‌ణ‌, శ్రీ‌లంక విద్యా వ్య‌వ‌స్థ‌లో అస‌మ‌ర్థ‌త వంటి ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై ప‌రిశోధ‌న‌లు చేశారు. నెస్ట్ అనే స్వ‌చ్చంధ సంస్థ బోర్డు స‌భ్యురాలిగా ఉన్నారు.

ఇక శ్రీ‌లంక దేశానికి సిరిమావో బండారు నాయ‌కే, చంద్రికా కుమారతుంగ త‌ర్వాత మూడో మ‌హిళా ప్ర‌ధాన‌మంత్రి కావ‌డం విశేషం. హ‌రిణి అమ‌ర సూర్య యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ నుండి సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్‌డీ డిగ్రీని పూర్తి చేసింది. పలు పుస్త‌కాలు రాసింది..ప్ర‌చురించింది కూడా.

డాక్ట‌ర్ హ‌రిణి అమ‌ర‌సూర్యా 2019లో నేషనల్ ఇంటలెక్చువల్స్ ఆర్గనైజేషన్‌లో చేరారు . 2019 శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎన్పీపీ అభ్యర్థి అనుర కుమార దిసనాయకే తరపున ప్రచారం చేశారు. ఎంపీగా ఎన్నిక‌య్యాక అధ్యాప‌కురాలి పోస్టుకు రాజీనామా చేశారు. మొత్తంగా అంద‌రి క‌ళ్లు ప్ర‌స్తుతం హ‌రిణి పై ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు.