ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు
సుప్రీంకోర్టులో వాదించిన డాక్టర్ కేఏ పాల్
ఢిల్లీ – ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ కు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానంలో చుక్కెదురైంది. మంగళవారం ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తన పిల్ ను కొట్టి వేస్తున్నట్లు పేర్కొంది.
ఓడి పోయినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని అంటున్నారు. మరి మీరు గెలిచిన సమయంలో ఆ విషయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. దీనిపై జోక్యం చేసుకున్న డాక్టర్ కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ది చెందిన దేశాలలో ప్రస్తుతం ఈవీఎంల వల్ల నష్టం ఏర్పడుతుందని, అందుకే తిరిగి బ్యాలెట్ పేపర్లను ఆశ్రయించారని గుర్తు చేశారు. తాజాగా అమెరికా దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలు వాడలేదని గుర్తు చేశారు. అందుకే భారత దేశంలో సైతం ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని డాక్టర్ కేఏ పాల్ కోరారు.
అంతే కాకుండా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు, మద్యం లేదా ఇతర వస్తు ప్రేరేపణలకు పాల్పడినట్లు తేలితే కనీసం ఐదేళ్లపాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని విన్నవించారు.
ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని, ఎలోన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా ఈవీఎం ట్యాంపరింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశారని మిస్టర్ పాల్ గుర్తు చేశారు.