ఓటు ఆయుధం జాగ్రత్తగా వాడాలి
హెచ్చరించిన ఈటల రాజేందర్
హైదరాబాద్ – ఓటు అనేది వజ్రాయుధమని దానిని జాగ్రత్తగా వాడు కోవాలని, పని చేసే వారికి ఓటు వేసి తమ నిబద్దతను చాటు కోవాలని పిలుపునిచ్చారు మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఎల్బీ నగర్ లో ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దేశంలో మోదీ పాలన పట్ల ప్రజలు అత్యంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారని అన్నారు. సుస్థిరమైన పాలన , సమర్థవంతమైన నాయకత్వం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి అడ్రస్ లేకుండా పోతుందన్నారు ఈటల రాజేందర్.
తమ పార్టీకి కనీసం 400 సీట్లకు పైగానే ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. ఆరు నూరైనా తాను మల్కాజిగిరి లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మోదీ 2014 లో బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ గా మొదటి మీటింగ్ హైదరాబాద్ లో పెట్టారని గుర్తు చేశారు.
ఇక్కడ బిజెపి ప్రభుత్వం లేక పోయినా ప్రజల ప్రేమ ఉందన్నారు ఈటల రాజేందర్. 32 శాతం ఉన్న రాష్ట్రాల పన్నుల వాటాను, 42 శాతం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రాల అభివృద్ధి లోనే దేశాభివృద్ధి ఉంది అని ఆచరించి చూపించారని అన్నారు. రాష్ట్రంలో ఆచరణకు నోచుకోని హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని మండిపడ్డారు.