దొంగ డాక్యుమెంట్స్ సృష్టించారని ఫైర్
హైదరాబాద్ – ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి నిర్వాకం పట్ల మండిపడ్డారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెముల గ్రామంలో 1985 లో 149 ఎకరాలు భూమిని లేఅవుట్ చేసి 2076 మందికి అమ్మారని అన్నారు. కొన్న వారిలో చిన్నపాటి ఉద్యోగులున్నారని తెలిపారు. డిపీఓను మేనేజ్ చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని ధ్వజమెత్తారు. కోర్టుకు వెళ్లిన బాధితులకు న్యాయం చేయాలని చెప్పినా పట్టించు కోలేదన్నారు.
గ్రామ పంచాయతీలో ఉన్న చిన్న ఉద్యోగులను పట్టుకొని వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసుకున్నారని ఆరోపించారు. ప్లాట్లు కొన్నవారు కోర్టుకు వెళితే కోర్టు వీడు దొంగ అని.. ప్లాట్లు కొన్న వారికి అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు.
2011లో మరోసారి ఇలాంటి ప్రయత్నమే జరిగిందని, మరోసారి కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మొట్టికాయలు పడ్డాయని తెలిపారు. అయినా వదిలిపెట్టకుండా కొద్దిమంది అధికారుల అండదండలతో.. డిపిఓ ను మేనేజ్ చేసి వ్యవసాయ భూమిగా మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు మళ్ళీ కొట్టి వేసిందన్నారు ఈటల రాజేందర్. ధరణి వచ్చిన తర్వాత కలెక్టర్ అమాయ్ కుమార్ ని పట్టుకొని 9 ఎకరాల భూమిని రాయించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దానితో పాటు పక్కన ఉన్న ప్లాట్లను కూడా దౌర్జన్యంగా కొన్నారని అన్నారు. 2076 ప్ట్లాట్లలో 206 తీసుకున్నారని, ఏకశిలా నగర్ లో 700 ఇల్లు ఉన్నాయని తెలిపారు.
మిగిలిన వారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కి వెళ్తే అనుమతి ఇవ్వడం లేదన్నారు. మున్సిపాలిటీ ఎల్ఆర్ఎస్ ఇవ్వడం లేదని ఆరోపించారు ఈటల రాజేందర్. రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానిక నాయకులను పట్టుకొని వందమంది గుండాలను, 10 కుక్కలను పెట్టి మరి ఈ ఏకశిలా నగర్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.