పోలీసుల జులుం దారుణం
ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన నిరుద్యోగులను, ప్రసారం చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పాశవికంగా పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
తెలంగాణలో నిరుద్యోగులు పదేళ్లుగా కళ్ళలో వత్తులు వేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.ఉద్యోగాల భర్తీ విధానంలో బి.ఆర్.ఎస్ తప్పుడు విధానాల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.
కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని, బతుకులు మారుతాయని అనుకున్నారని తీరా అసలు స్వరూపం ఏమిటో అర్థమైందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు.
ఏడు నెలలు కానే లేదు అప్పుడే మోసానికి తెర లేపారంటూ ఫైర్ అయ్యారు. నిరుద్యోగుల మీద పాశవిక దాడి దారుణమన్నారు. జర్నలిస్టులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఈటల రాజేందర్. ఇలాగే కొనసాగితే నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.