దర్యాప్తు సంస్థ వెల్లడి
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) . ఈ మేరకు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు సంబంధం ఉందని తేల్చి చెప్పింది.
ఆమె సౌత్ గ్రూప్ కు చీఫ్ గా ఉంటూ మొత్తం పాలసీని మార్చేసిందని, రూ. 100 కోట్ల ముడుపులు హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిందని ఆరోపించింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలతో కూడిన నివేదికను ఈడీ కోర్టుకు సమర్పించింది. ఇందులో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి.
మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ముఖ్య భూమిక పోషించారని , ఇప్పటి వరకు ఇదే కేసుకు సంబంధించి 15 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపింది. ఈడీ మొత్తం వివరాలతో కూడిన ప్రకటన చేసింది. డబ్బులన్నీ కవిత ద్వారానే చేతులు మారాయని స్పష్టం చేసింది దర్యాప్తు సంస్థ.
రూ. 128 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించడం జరిగిందని, ఈ మేరకు వాటిని అటాచ్ చేశామని, విచారణ సందర్భంగా కవిత తమకు సహకరించ లేదని ఆరోపించింది. అంతే కాకుండా ఆమె బంధువులు విచారణ జరగకుండా అడ్డుకున్నారని పేర్కొంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి దేశ వ్యాప్తంగా 245 ప్రాంతాలలో సోదాలు చేపట్టినట్లు తెలిపింది.